Return to site

సినిమా @ తెలంగాణ

తెర మరుగున మన తేజోవంతమైన చరిత్ర

 

 

 

 

 

 

 

తెర మరుగున మన తేజోవంతమైన చరిత్ర

1908లో హైదరాబాద్‌లో మూసీనదికి పెద్దఎత్తున వరదలు వచ్చి జననష్టం, ఆస్తినష్టం భారీగా జరిగాయి. ఈ వరదల దృశ్యాలను చిత్రీకరించడానికి ఆరవ నిజాం మహబూబ్ ఆలీ కోల్‌కతాకు చెందిన జె.ఎఫ్.మదన్ బృందాన్ని రప్పించి, సినీ కెమెరాలతో వరద దృశ్యాలను షూట్ చేయించారు. ఆ తరువాత ఈ దృశ్యాలను ప్రజల కోసం ప్రదర్శించారు కూడా. వీటి గురించి ఆ రోజుల్లో హైదరాబాద్ ప్రజలు కథలు, కథలుగా చెప్పుకునేవారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు, నిజాం స్టేట్‌లో 1908కి ముందే సినిమాల గురించిన పరిచయం ఉందని చెప్పడానికి. అంతేకాదు, హైదరాబాద్‌లో 1908కి ముందే ఫిలిం స్క్రీనింగ్స్ జరిగాయి. ఇది కాదనలేని సత్యం. 1908లోనే బాబూ పి.ఎస్ అనే ఒకాయన తెలంగాణ అంతటా తిరిగి ఇంపీరియల్ బయోస్కోప్ కంపెనీ పేరున మూకీ సినిమాలు ప్రదర్శించారు. ఆయన ఎవరో కాదు, 1935లో తయారైన శ్రీకృష్ట తులాభారంలో కృష్ణుడుగా నటించిన ఎస్.జైసింగ్‌కి తండ్రి. ఈ బాబూ పి.ఎస్. ఎక్కడివాడో తేలాల్సి ఉన్నప్పటికీ 1908కి ముందే తెలంగాణ సినిమా ప్రారంభమైందని రూఢీ అవుతోంది. కాగా, తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్య 1909లో సినిమా ప్రదర్శన మొదలు పెట్టిన విషయం చరిత్రలో ఉంది. ఇంకా తవ్వవలసిన చరిత్ర మనపై ఉందనే ఈ నాలుగు మాటలు.

ఆ దిశగా కొన్ని ఆధారాలతో మన ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాల్సే ఉంది. ఉదాహరణకు ఇటీవల 2010లో లండన్ సేజ్ పబ్లికేషన్స్ వారు ప్రచురించిన బయోస్కోప్ అనే గ్రంథం ద్వారా హైదరాబాద్‌లోని మూకీల నాటి కొన్ని చారిత్రక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇవన్నీ కూడా 1908కి ముందే హైదరాబాదులో స్క్రీనింగ్స్ జరిగినట్లు రుజువు పరుస్తున్నవి. ఆ గ్రంథంలో పేర్కొన్నట్టు, 1896 సెప్టెంబర్ మొదటి వారంలోనే సికింద్రాబాద్ నుండి చిన్న సినిమాల (మూకీలు)తో కూడిన పీప్ హోల్ షోస్ మద్రాసు వెళ్లినట్లుగా స్టీఫెన్ పుట్నాం హ్యూస్ రాశారు. అంతేగాకుండా 1897, ఆగస్టులో స్టీవెన్‌సన్ అనే విదేశీ మూకీ చిత్రాల ప్రదర్శకుడు దక్షిణ భారతదేశమంతటా పర్యటిస్తూ హైదరాబాద్ జంట నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చినట్లు WHEN FILM CAME TO MADRAS అనే అధ్యాయంలో వివరించారు. పై విషయాలన్నీ 1896 సెప్టెంబర్ 2, 1897 ఆగస్టు 31 నాటి మద్రాసు మెయిల్ అనే దినపత్రికలో రిపోర్టు అయ్యాయి కూడా. అయితే, ఈ స్టీవెన్‌సన్ హైదరాబాద్‌లో ధనవంతుల కుటుంబాల వారికి ప్రైవేటుగా కూడా ఆ రోజుల్లో సినిమా ప్రదర్శనలు వేసి చూపాడని తెలుస్తోంది. వీటన్నిటిని బట్టి హైదరాబాద్‌లో మూకీల చరిత్రకు బలమైన సాక్ష్యాధారాలు లభించినట్లే. ఆ వైపుగా మరింత పరిశోధన చేస్తే 120 ఏళ్ళ కిందటే తెలంగాణలో సినిమా ఉందనేది నిశ్చయంగా రజువవుతుంది.

ఏడవ నిజాం (1911) పాలనకు వచ్చిన తరువాత కూడా సినిమా పట్ల తమ ఆదరణను ప్రకటిస్తూ వచ్చారు. 1920లోనే సెలక్ట్ టాకీస్ కట్టించారాయన. అదే సంవత్సరం బీడ్ జిల్లా పర్‌భనీలో సర్దార్‌ఖాన్ దక్కన్ సినిమా అనే థియేటర్‌ని నిర్మించారు. కాగా, మొన్నటి దాకా తెలుగు నాట నిర్మితమైన తొలి థియేటర్‌గా విజయవాడలోని మారుతిని చెప్పుకున్నా అది 1921 అక్టోబర్‌లో మొదలైంది. దీంతో థియేటర్ల నిర్మాణంలో కూడా తెలంగాణనే ముందున్నదని తేలిపోతోంది. అంతేకాదు, సినిమాల ప్రదర్శన రంగంలో భారతదేశంలో ఎక్కడా జరగని ప్రక్రియ హైదరాబాద్‌లో జరిగింది. అదే మహమూద్‌మియా సినిమా బండి. ఈ ప్రక్రియను పీప్ హోల్ షోలకు కొనసాగింపుగా చెప్పుకోవచ్చు.

1921లో మద్రాసులో తయారైన భీష్మపత్రిజ్ఞ తెలుగువారు తీసిన తొలి మూకీ అంటున్నా అది అరవదేశంలో తయారైన తెలుగు వారి తొలి మూకీ. అయితే, తెలుగు నేల (ఆంధ్ర)లో తొలిసారిగా కాకినాడలో సి.పుల్లయ్య 1925లో భక్త మార్కెండేయ మూకీ తీశారు. మూకీల కాలంలో మద్రాసు నుండి ఇక్కడికి వచ్చి మూకీలు తీసినట్లు గానీ, ఇక్కడి వారు అక్కడికి వెళ్లినట్లు గానీ ఎక్కడా రికార్డు చేయలేదు. ఇక్కడ ఏర్పడిన నిర్మాణ సంస్థలన్నీ హైదరాబాద్‌కు చెందినట్లు దక్కను అని రాశాయి. కాగా, మూకీల చరిత్రలో హైదరాబాద్‌లో జరిగిన మూకీల చిత్ర నిర్మాణం గురించిన వివరాలను తెలంగాణ సినీ చరిత్రకు తొలి రోజులుగా చూడాలి. కానీ, మద్రాసుతో ఎంతమాత్రం ముడిపెట్టకూడదు. ఎందుకంటే, మద్రాసు కన్నా మూకీల కాలంలో హైదరాబాద్ ముందుంది కనుక. కానీ, ఆశ్చర్యం ఏమిటంటే, అరవదేశంలో తెలుగు సినిమాలు తీసి ఆ చరిత్రనంతా తెలుగు సినిమా చరిత్ర అంటున్నారుగానీ, హైదరాబాద్‌లో తయారైన సినిమాలది తెలంగాణ సినిమా చరిత్ర కాదా? అన్నది ప్రశ్న.అయినా గానీ, ఇవన్నీ కుట్రలనే తేలిపోయింది. ఇక ప్రశ్నించడం సరే అనుకుని, ఈ అనుభవాలన్నిటి నుంచీ స్వరాష్ట్రం వచ్చిన సందర్భంగా మన వెండివెలుగుల చరిత్రను మనమే పునర్లిఖించుకుందాం. స్వీయ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటిద్దాం.

హైదరాబాద్‌లో మూసీనది వరదల దృశ్యాలను చిత్రీకరించడానికి ఆరవ నిజాం మహబూబ్ ఆలీ కోల్‌కతాకు చెందిన జె.ఎఫ్.మదన్ బృందాన్ని రప్పించారు. సినీ కెమెరాలతో వరద దృశ్యాలను షూట్ చేయించారు. ఈ ఒక్క ఉదాహరణ చాలు, నిజాం స్టేట్‌లో 1908కి ముందే సినిమాల గురించిన పరిచయం ఉందని చెప్పడానికి.

అరవదేశంలో తెలుగు సినిమాలు తీసి ఆ చరిత్రనంతా తెలుగు సినిమా చరిత్ర అంటున్నారు గానీ, హైదరాబాద్‌లో తయారైన సినిమాలది తెలంగాణ సినిమా చరిత్ర కాదా? అన్నది ప్రశ్న.

All Posts
×

Almost done…

We just sent you an email. Please click the link in the email to confirm your subscription!

OKSubscriptions powered by Strikingly